Hindi Sahitya Charitra 2 / హిందీ సాహిత్య చరిత్ర – 2

హిందీ సాహిత్య చరిత్ర – 2

హిందీ మూలం :  డా. ఋషభ్ దేవ్ శర్మ

తెలుగు అనువాదం :  డా. యస్.వి.యస్. యస్. నారాయణ రాజు

हिंदी मूल :  डॉ. ऋषभ देव शर्मा

                   तेलुगु अनुवाद : डॉ. एस.वी.एस.एस. नारायण राजू

स्रवंति / స్రవంతి

सितंबर 2003   / సెప్టెంబరు 2003

       ( హిందీ సాహిత్య విశేషాలను తెలుగు పాఠకులకు, తెలుగు సాహిత్య రీతులు మరియు తీరుతెన్నులను గురించి హిందీ పాఠకులకు అందించి తద్వారా జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడమే స్రవంతి ద్విభాషా మాసపత్రిక యొక్క లక్ష్యము. ఈ లక్ష్య సాధనలో ఒక భాగంగా  హిందీ సాహిత్య చరిత్రను తెలుగు పాఠకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ శీర్షకను ప్రారంభించడం జరిగింది. హిందీలో ఉచ్ఛ శిక్ష ఔర్ శోధ్ సంస్ధాన్, హైదరాబాద్ శాఖ రీడర్ డా. ఋషభ్ దేవ్ శర్మ గారు వ్రాసిన హిందీ సాహిత్య కీ రూప్ రేఖా ను తెలుగులో హిందీ సాహిత్య చరిత్ర పేరిట డా. యస్.వి.యస్.యస్. నారాయణ రాజు గారు అనువాదం చేశారు. ఇకపై ప్రతి నెలా హిందీ సాహిత్య చరిత్రను అధ్యయనం చేసి సంపూర్ణ హిందీ సాహిత్య చరిత్రను గూర్చి తెలుసుకునేందుకు వీలుగా క్రమంగా ప్రచురించడం జరుగుతుంది.                                                                                                                                              సంపాదకులు)

 

  ఆదికాలము -  భూమిక :

(1)      రాజకీయ పరిస్థితులు :- హిందీ భాష మరియు సాహిత్యం యొక్క ప్రారంభము రాజకీయ అస్థిరత మరియు అరాచకాలతో  అల్లకల్లోమైన పరిస్థితులలో జరిగినది. ఆది కాలమునకు ముందు శతాబ్దాల యొక్క చరిత్ర గమనాన్ని పరిశీలించినచో ఈ అరాచకమయిన పరిస్థితుల యొక్క ప్రారంభం 7వ శతాబ్దంలోనే హర్షవర్ధనుని సామ్రాజ్య పతనంతో ప్రారంభమయినది. క్రీ.శ. 712లో అరబ్ కి చెందిన మహమ్మద్ బిన్ కాశిమ్ సింధ్ ప్రాంతంపై దండయాత్ర చేశాడు. అతడు భారతీయ ప్రజల మాన ప్రాణాలను దోచుకోవడమే కాక అనేక మందిరాలను ద్వంసం చేశాడు. వేలాది మంది భారతీయులను మత మార్పిడి చేయంచాడు మరియు దేశ సంపత్తిని దోచుకునిపోయాడు. అతని తర్వాత పదవ శతాబ్దంలో గుర్జర్, ప్రతిహారుల మరియు గడ్ వాల్ ల యొక్క రాజ్య విస్తరణ మరియు పతనము జరిగినది. జయచంద్ర్ గడ్ వాల్ వంశానికి చెందిన చివరి సామ్రాట్టు. అజ్మేర్ మరియు ఢీల్లీలపై చౌహాన్ వంశస్థుల అధికారం ఉండేది. వారిలో చివరి ప్రతిభావంతుడైనవటువంటి శాసకుడు పృధ్వీరాజ్ చౌహాన్. ఇతని ముందు కాలంలో క్రీ.శ. 1001 నుండి 1025 లో మహ్మద్ గజనబీ భారత్ పై దురాక్రమణ చేశాడు మరియు సోమనాథ్ మందిరమును ద్వంసం చేశాడు. 1191లో మహ్మద్ గోరీని తరాయికి ముందు యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాడు. కాని 1192 లో జరిగిన రెండవ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహ్మద్ గోరి చేతిలో పరాజయాన్ని చవిచూడవలసి వచ్చింది. అరబ్బులు మరియు తుర్కులు తర్వాత గోరి చేసిన ఈ దురాక్రమణ అత్యంత ప్రళయం కారకమయిన దురాక్రమణ. పృథ్వీరాజ్ మరియు జయచంద్రలను ఓడించి అతడు కుతుబుద్ధీన్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం వంశస్తుల పాలనకు శ్రీకారం చుట్టాడు. దీని తరువాత కొద్ది కాలానికే అజ్మేర్, గ్వాలియర్ కాలింజర్, మొహాబా, బీహార్ మరియు బెంగాల్ లు విదేశీ దురాక్రమణదారుల వశమయినాయి. ఖిల్జీ వంశస్తుల మరియు తుగ్లక్ వంశస్తుల శాసన కాలం కూడా ఆదికాలంలోనికే వస్తుంది. ఇదే కాలంలో పర్షియాకు చెందిన తైమూర్ లంగ్ దురాక్రమణ కూడా జరిగినది. ఆదికాలంలో ఇస్లాం మతం భారత దేశాన్ని రాజకీయపరమైన బానిసత్వంలోనికి నెట్టడమే కాకుండా మతపరమైన మరియు సామాజిక సంబంధమయినటువంటి అస్థిరతను సృష్టించింది.

 

(2) మతపరమైన పరిస్థితులు :

      మతపరమైన పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ కాలము అస్థిర పరిస్థితులతో కూడినది. 6వ శతాబ్దంలో వైదిక సంబంధమయిన యజ్ఞ యాగాదులు, విగ్రహపూజ, బౌద్ద మతాలలో ఉపాసనా పద్దతుల యొక్క బాహుళ్యం ఉండేది. కాని 7వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో భౌద్ధదర్మ పతనం ప్రారంభం అయినది. మరియు ఆళ్వార్ లు మరియు నయనార్ ల ద్వారా విష్ణు మరియు శివభక్తి ప్రచారము దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశం వైపు పయనించింది. ఈ కాలంలో జైన, శైవ మరియు వైష్ణవుల మధ్య విపరీతమైన బేధభావాలు ఉండటమే కాకుండా పరస్పరం ఘర్షణ పడేవారు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు(788) తన అద్వైత వాదముతో సంపూర్ణ భారతదేశంలో ఒక కొత్త అధ్యాయమునకు శ్రీకారం చుట్టాడు. 12వ శతాబ్దం వచ్చేనాటికి జైనమతం క్షీణదశకు వచ్చింది. శైవ, వైష్ణవ మతాలు వ్యాప్తి చెందాయి. శైవ, బౌద్ధ మరియు స్మార్త సాంప్రదాయాల మేలు కలయికతో సిధ్ద్ పంత్ మరియు నాథ్ పంత్ ల అవిర్భావం జరిగింది. రెండవవైపు ఇస్లాం ప్రవేశంతో పెద్ద ఎత్తున భారతీయ మందిరాలను ధ్వంసం చేయడంతో మతపరంగా రక్షణ లేకపోయింది. ఇస్లాం ప్రభావం పెరగడంతో పాటు ఒకరినొకరు పరస్పరం ఖండించుకొనే ప్రవృత్తి కూడా పెరిగింది.

(3).సాంస్కృతిక పరిస్థితులు : సాంస్కృతిక పరంగా చూసినట్లయితే ఆదికాలం యొక్క ప్రారంభం నాటికి భారతీయ సంస్కృతి అత్యున్నత శిఖిరాలపై విరాజిల్లుతూ ఉంది. ఆదికాలం యొక్క అంతిమ సమయానికి ఇది అత్యంత క్షీణదశకు చేరుకుంది. ముస్లిం సంస్కృతి యొక్క ఆగమనంతో, దానితో పోటిపడటము మరియు రాజీపడటము అనే ప్రక్రియలోనే ఈకాలమంతా గడిచిపోయింది. బంగారు పిచ్చుకగా అభిపర్ణించే ఈ దేశం యొక్క కళ సంస్కృతి మరియు మతము సహనము, సౌశీల్యముతో కూడినదే కాక ఇతర సంస్కృతి, మతములను సమాదరించే గుణానికి ప్రతీక, మహమ్మద్ గజనబీ కూడా ఈ సంస్కృతి యొక్క గొప్పతనం పట్ల ఆకర్షితుడయినాడు. కాని ఈ సంస్కృతిపై విదేశీదురాక్రమణ జరిగిన నాడు వ్యక్తిగత అహంకారము మరియు పరస్పరము సహకరించపోవటం వలన రాజ్ పూత్ రాజులు అత్యంత పరాక్రమ వంతులయినప్పటికీ దేశాన్ని రక్షించలేకపోయారు. దీనితో భారతదేశం బానిస సంస్కృతికి ఆలవాలమయిన జాతి అవ్వవలసి వచ్చింది. ఈ కాలంలో ఉత్సవాలు. జాతరలు, వస్త్రాలు, ఆహారనియమాలు, సంగీతము, నృత్యము, చిత్రకళ మరియు శిల్పకళలలో ముస్లిం ప్రభావం ప్రారంభమయినది.

(4) ఆర్థిక పరిస్థితులు : ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఆది కాలము అత్యంత ప్రగతి నిరోధక కాలమని చెప్పవచ్చు. ఎందుకంటే నిరంతరము యుద్ధాలు, దురాక్రమణలు, సరియైనటువంటి రక్షణ లేకపోవటము మరియు అరాచకత్వం వలన అనేక శతాబ్దాలుగా భారతదేశంలో వ్యాపార సంబంధాలు నెరుపుతున్న అనేక దేశాలు భారతదేశంతో వ్యాపార సంబంధాలను తెంచుకున్నాయి. ఈ కాలంలో చిన్న చిన్న సామంతరాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా    ఏర్పడినాయి. వ్యాపారం పతనమయినది. పన్నులను చోరీ చేసే ప్రవృత్తి పెరిగినది. సముద్రపు దొంగల దుశ్చర్యలు ఎంతగా పెరిగాయంటే సముద్రయానాన్నే పూర్తిగా నిషేదించటం జరిగినది. భారతీయ  ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ కాలములో భూమిపై వ్యక్తిగత అధికారము మరియు జమిందారీ వ్యవస్థ యొక్క కాలము. ఈ కాలములోనే వ్రాతపనిని నిర్వహించే కాయస్థులనే ఒక కొత్త జాతి ఉద్భవించనది. ఆర్థికంగా విభిన్న వర్గాల మధ్య అంతరం పెరిగినది.

(5) సామాజిక పరిస్థితులు : ఆదికాలంలో సమాజము శాసనము మరియు మతపరంగా కూడా అత్యంత నిరాదరణకు గురి అయినది. యుద్ధాల కారణంగా సాధారణ ప్రజలు నిరంతరం పీడించబడ్డారు. ప్రజల వారి యొక్క అలవాటు ప్రకారం కష్ట సమయాల్లో దైవం పట్ల ఆకర్షితులయినట్లే భారతదేశంలోని ప్రజలు కూడా దైవం పట్ల ఆకర్షితులయినారు. కాని నిరక్షరాస్యులయిన వీరికి భ్రమ తప్ప మరేమియు మిగలలేదు. మూఢనమ్మకాలలో మునిగిన సమాజంలో మాయలు, మంత్రాలు అనేక రకాలయిన పూజా విధానాలపట్ల ప్రజలకు ఆసక్తి పెరిగింది. ఒక వైపు భోగములోనే దేవుణ్ణి దర్శింపచేసే వజ్రయాని సాధువులు యొక్క ఆకర్షణ, రెండవ వైపు కన్ ఫటే యోగుల యొక్క దుశ్చర్యలు. ప్రజలు సామాజిక మరియు మానసిక శాంతిని వెతుకుతూ తిరగడం ప్రారంభించారు. విభిన్న వర్ణాల మధ్య ఎంతగా భేదం ఏర్పడినదంటే అగ్రవర్ణాల వారికి భోగవిలాసాలు జన్మసిద్ధ అధికారంగా లభించాయని నిమ్నవర్ణాలవారు పశువుల వలె పనిచేయడమే తమ భాగ్యమని భావించటం జరిగినది. దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా శ్రమను దోచుకోవటం జరుగుతుండేది. స్త్రీలను విలాస వస్తువుల వలె రోడ్డుపై అమ్మటం మరియు కొనడం జరుగుతూ ఉండేది. స్త్రీ జాతి పట్ల భోగవాది దృష్టి కారణంగా స్త్రీని అత్యంత బలహీనురాలు మరియు పతితగా చేయటమేకాక అపహరణ మరియు బలాత్కరించుట సర్వసాధారణమైపోయినది. ఘోష మరియు సతి మొదలయినటువంటి మూర్ఖపు ఆచారాల కారణంగా స్త్రీ పట్ల సమాజపరమైనటువంటి అన్యాయం పెరిగిపోయింది. పైకారణాలన్నింటి వలన సమాజము మతపరమైనటువంటి సమస్యలతో నిండిపోయినది.

(6) సాహిత్య పరిస్థితులు (అపభ్రంశ సాహిత్యం) :  ఆదికాలము భూమికలో సంస్కృతి సాహిత్య వికాసముతో పాటు అపభ్రంశ సాహిత్యం యొక్క ఉన్నతి కూడి ఉన్నది. అపభ్రంశమునకు చెందిన అనేక మంది కవులలో ముఖ్యమైనవారు 19 మంది. కాని వీరిలో స్వయంభు, పుష్పదంత్, ధన్ పాల్, అబ్దుల్ రహమాన్, జిన్ దత్ సూరి, జోయిందు మరియు మునిరామ్ సింగ్ మొదలయిన వారు ప్రముఖులు.

స్వయంభు (783) : ఇతడు కర్ణాటకు చెందినవాడు. పఉమ చరిఉ, రిట్టణేమిచరిఉ మరియు స్వయంభుచంద్ ఈయన యొక్క ప్రముఖ రచనలు పఉమచరిఉ లో జైన దృష్టితో రామకథను వర్ణించడం జరిగింది.

పుష్పదంత్ (10వ శతాబ్దం) : మహాపురాణ్, ణయకుమార్ చరిఉ మరియు జనహరిచరిఉ మొదలయివని ఈయన ప్రముఖ రచనలు. మహాపురాణ్ లో 63 మంది మహాపురుషుల యొక్క వర్ణన ఉంది. అందులో రాముడు ముఖ్యుడు. పుష్పదంతుడు యొక్క గొప్పతనం అందరికన్న ఎందుకు ఎక్కువ అంటే ఈయన భాషలో హిందీ యొక్క బీజాలు కన్పిస్తాయి.

ధన్ పాల్ (10వ శతాబ్దం) : ఈయన రచించిన అపభ్రంశ కావ్యము భవిష్యత్ కహా ఇందులో మత మరియు ప్రజా హృదయాలలోని నిగూఢమయి ఉన్న భావాలను ఆవిష్కరించటంలో యిది పేర్కొనదగినది.

అబ్దుల్ రహమాన్ (12వ శతాబ్దం) : ఇతనికి అపభ్రంశ కవులలో అద్వితీయమైన స్ధానమున్నది. ఇతడు రచించిన సందేశ్ రాసక్ అనే ఖండకావ్యము శృంగార రసావిష్కరణకి ఒక మచ్చుతునక.

జిన్ దత్తసూరి (12వ శతాబ్దం) : ఇతడు రచించిన నృత్యగీతి కావ్యం ఉపదేశ్ రసాయన్ రాస్ లో రాస్ లీలా పద్ధతిలో కృష్ణ భక్తికి సంబంధించిన 8 పదాలున్నాయి.

  ఆరో శతాబ్దానికి చెందిన జోయిందు వ్రాసిన పరమాత్మ ప్రకాష్ మరియు యోగ్ సార్ మరియు 11వ శతాబ్దానికి చెందిన మునిరామ్ సింగ్ రచించిన పాహుడ్ ద్వారా భక్తి మరియు నీతి సంబంధమయిన దోహ పరంపర యొక్క నిర్మాణం జరిగినది.

 ఈ విధంగా అపభ్రంశ కావ్యంలో మోక్షము. మత సంబంధమయిన కావ్యాలు, చరిత కావ్యాలు,  సందేశ కావ్యాలు, శృంగార కావ్యాలు మరియు నీతి కావ్యాలకు సంబంధించిన వివిధ పరంపరలు మరియు శైలులు ఈ కాలంలో ఉన్నాయి. ఇది కేవలము ఆదికాలీన కవులకు సంబంధించినవే కాక సంపూర్ణ హిందీ సాహిత్యానికే సాహిత్యక వారసత్వ సంపదగా లభించినాయి.                 

 

 

 

 


Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी