గాంధీజీ దృక్పధంలో స్త్రీ

 

గాంధీజీ దృక్పధంలో స్త్రీ


Dr. S V S S Narayana Raju

సంపాదకీయం

స్రవంతి,

ద్విభాషా మాస పత్రిక, మార్చ్ – 2004.

संपादकीय,

स्रवंति,

द्विभाषा मासिक पत्रिका, मार्च – 2004.

 

మనదేశంలోని స్త్రీని ఒకవైపు లక్ష్మి, దుర్గ, సరస్వతీ మొదలైనటువంటి దేవతల రూపంలో పూజ చేసే సాంప్రదాయముతోపాటు ఇదే సమయంలో స్త్రీని పురుషుడు దాసిగా చూసే దురాచారం కూడా ఉంది. గాంధీ గారు స్త్రీని దేవతగా కాని, దాసిగా కాని ఒప్పుకొనలేదు. ఆయన స్త్రీని పురుషుని సహచారిణిగా మరియు జీవిత భాగస్వామిగానే గుర్తించారు. స్త్రీ కేవలం పురుషుని కోర్కెలను తీర్చే సాధనం కాదు మరియు వంటింటి కుందేలు. కాదు. స్త్రీ పురుషునితో సమానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలు మొదలైన అన్నింటిలో సమానంగా పాల్గొంటూ దేశం యొక్క ప్రగతిలో తన పాత్రను నిర్వహించే హక్కు ఉన్నది. స్త్రీని 'అబల' అని అనడం గాంధీగార్కి సుతారమూ ఇష్టం ఉండేది కాదు. కేవలము శారీరక బలమే గీటురాయి అయినచో నిస్సందేహంగా స్త్రీ పురుషునికన్నా వెనుకే ఉంటుంది. కాని ఆత్మబలం ఆధారంగా శ్రేష్ఠత్వాన్ని గుర్తించినట్లైతే పురుషుడుకన్నా స్త్రీ ఎన్నో రెట్లు ముందుంటుంది. గాంధీగారి అభిప్రాయం ప్రకారం స్త్రీలో ఉన్నంత సహనశీలత పురుషులలో లేదు. భవిష్యత్ సమాజం పూర్తిగా అహింసా పునాది మీదే నిర్మింపబడుతుందని ఆయన అభిప్రాయము. ఇందువలననే సత్యాగ్రహ ఉద్యమంలో స్త్రీలను ముందుంచి నడిపించేవారు. హృదయాన్ని ఆకట్టుకొనేటట్లుగా చెప్పే శక్తి స్త్రీలకే ఉంటుందని ఆయన నిశ్చితాభిప్రాయము. స్వాతంత్రోద్యమ కాలంలో మద్యపాన నిషేధ ఉద్యమం స్త్రీల ద్వారానే నడిపారు. గాంధీగారి పిలుపునందుకొని అనేక వేల మంది మహిళలు, సారా దుకాణాలు దగ్గరకు వెళ్ళి మద్యపాన ప్రియులకు బుద్ధిచెప్పడమే కాక, విదేశీ వస్త్ర బహిష్కరణలో కూడా పోలీస్ లాఠీలకు వెరవకుండా పికెటింగ్లను నిర్వహించారు. ఈ విధంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పురుషులతో సమానంగా పాలు పంచుకున్నారు. ఈ సందర్భంలో శ్రీమతి సరోజినినాయుడు, విజయలక్ష్మి పండిట్, దుర్గాబాయ్ దేశముఖ్ మొదలైనటువంటి మహిళలు మనకు తప్పకుండా గుర్తుకు వస్తారు.

 

గాంధీగారు బాల్యవివాహాలు, వరకట్నదురాచారం, సతి, అనివార్యవైధవ్యం, వేశ్యావృత్తి మొదలైనవాటికి బద్ద విరోధి, వివాహం స్త్రీ పురుషులు పరస్పరం జీవించడానికి సహకరించే పవిత్రబంధం అని వారి ఉద్దేశ్యము. దీనికి ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు, నిర్బంధ పద్ధతులు ఉండకూడదని వారి అభిప్రాయము. స్త్రీలు తమను తాము సౌందర్యానికి ప్రతీకలుగా చేసుకొని సర్వాలంకారభూషణలతో అలంకరించుకోవడం మంచిది కాదని వారి ప్రగాఢ విశ్వాసము. స్త్రీలు అతిగా అలంకరించుకొని సౌందర్య ప్రతిమలువలె తయారై పురుషుని కోర్కెలు తీర్చే యంత్రంగా ఉండే కన్నా ఆత్మ బలం, స్వాభిమానంతో కూడిన సౌందర్యాన్ని సంపాదించాలని అనేవారు. గాంధీగారు అహింసావాది అయినప్పటికీ, స్త్రీలు తమను ఇబ్బందులకు గురిచేసేవారి నుండి ఆత్మరక్షణ చేసుకోవడానికి గోళ్ళను ఉపయోగించడం మొదలైన వాటిని సమర్ధించారు. అవసరమైతే తిరగబడాలని స్త్రీలకు సూచించారు. ఈవిధంగా గాంధీగారు సమాజ అభ్యున్నతికి స్త్రీలు పట్టుకొమ్మలని, వారు సమాజాభివృద్ధికి పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పారు. మహిళాదినోత్సవం సందర్భంగా గాంధీగారి అభిప్రాయాల ప్రకారం స్త్రీలు దేశాభివృద్ధిలో మరింత ముందుండాలని 'స్రవంతి' తరఫున మహిళా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.

 

 డా.  నారాయణ రాజు

 సహ సంపాదకుడు


Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी