అపర చాణక్యుడు శ్రీ పి.వి. నరసింహారావు









అపర చాణక్యుడు శ్రీ పి.వి. నరసింహారావు

Dr. S V S S Narayana Raju

సంపాదకీయం

స్రవంతి,

ద్విభాషా మాస పత్రిక, జనవరి – 2005.

संपादकीय,

स्रवंति,

द्विभाषा मासिक पत्रिका, जनवरी – 2005.



మహా విద్వాంసులు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ పాములపర్తి వేంకట నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం, లక్కెనపల్లిలో 28 జూన్, 1921న శ్రీ సీతారామారావు మరియు రుక్మాబాయమ్మ దంపతులకు జన్మించారు. వంగర గ్రామవాసి శ్రీ పాములపర్తి రంగారావు గారు శ్రీ పి.వి. నరసింహారావు గారిని దత్తతు తీసుకున్నారు. శ్రీ రావుగారు ఎల్.ఎల్.బి. పరీక్షలో బంగారు పతకాన్ని పొందారు. ఆయన 1939వ సంవత్సరంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనేక పదవులను శ్రీ రావుగారు పొందారు అనేకంటే అనేక పదవులు శ్రీరావుగారిని పొంది తమ తమ గౌరవాన్ని పెంపొందించుకున్నాయి అని అనడం ఎంతైనా సమంజసం.

శ్రీ రావుగారు ఒక రాజకీయవేత్తయే కాకుండా సాహితీవేత్త కూడా. దేశభాష హిందీ యొక్క ప్రచారము మరియు ప్రసారమునకు విశేషసేవలందించారు. ''జ్ఞానపీర్' పురస్కారవిజేత కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి 'వేయిపడగలు' నవలను హిందీలో 'సహస్రఫణ్' పేరుతో శ్రీ రావుగారు అనువదించారు. రాజకీయాల నుండి నిష్క్రమించిన తర్వాత 'ఇన్సైదర్' (Insider) పేరుతో తన ఆత్మకథను నవలారూపంగా వ్యక్తపరిచారు. పి.వి. తెలుగు భాషలో 'మంగయ్య అదృష్టం' అనే శీర్షికతో ఒక నవలను కూడా వ్రాసారు. ఇది తెలుగులో ఒక ప్రసిద్ధ పత్రికలో ధారావాహికంగా వెలువడింది. అయితే ఇందులో సమకాలీన రాజకీయ నాయకులపై వ్యంగ్యోక్తులు ఎక్కువగా ఉండటం వలన దీనిని నవలగా ప్రచురించరాదని పి.వి.యే స్వయంగా నిర్ణయించుకున్నారు.

పి.వి. నరసింహారావుగారు దక్షిణ భారత హిందీ ప్రచార సభకు అధ్యక్షులుగా పని చేశారు. వారి పదవీ కాలంలో సభ మూడు పువ్వులు ఆరు కాయలుగా సర్వతోముఖాభివృద్ధిని సాధించినది.

1991వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ హత్యానంతర కఠిన పరిస్థితులలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు. తరువాత ప్రధాన మంత్రి పదవిని చేపట్టి ఐదు సంవత్సరాలపాటు అత్యంత సమర్ధవంతంగా ప్రభుత్వాన్ని నడపటమే కాక గ్లోబలైజేషన్ ను పాటించి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ ను నిలబెట్టడానికి నిర్విరామంగా కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో శ్రీ రావుగారు పేదలకు భూమిపంపిణీతో పాటు అనేక ప్రజాహిత కార్యక్రమాలను సమర్ధవంతంగా చేపట్టారు.

శ్రీ పి.వి. నరసింహారావు గారి మరణం తెలుగు ప్రజలు, యావద్భారతదేశానికే కాక విశ్వమానవాళికే ఒక తీరని లోటు. బహుభాషా ప్రజ్ఞాశాలి, స్వాతంత్య్ర్య సమరయోధుడు మరియు ప్రజానాయకుడు అయిన శ్రీ. పి.వి. నరసింహారావుకు దక్షిణ భారత హిందీ ప్రచార సభ మరియు స్రవంతి తరపున అశ్రునయనాంజలిని అత్యంత శ్రద్ధాభక్తులతో సమర్పిస్తున్నాము.
డా. నారాయణరాజు

సహాయక సంపాదకులు.

Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी