హిందీ సేవలో నేను గడిపిన మధుర క్షణాలు





హిందీ సేవలో నేను గడిపిన మధుర క్షణాలు

Dr. S V S S Narayana Raju

ఆంగ్లమూలం: డా. శ్రీనివాస అయ్యంగార్

తెలుగు అనువాదం: డా. నారాయణరాజు

స్రవంతి,

ద్విభాషా మాస పత్రిక, సెప్టెంబర్ – 2003.

स्रवंति,

द्विभाषा मासिक पत्रिका, सितंबर – 2003.


1934లో చిత్తూరులో హిందీ ప్రేమీమండలిని స్థాపించారు. 1946లో జీవకారుణ్యసంఘంలో మేము హిందీతరగతులను నిర్వహించేవారము. 1946 సం॥లోనే దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ, మద్రాస్ యొక్క సంయుక్త కార్యదర్శి శ్రీరఘువీర్ దయాళ్ మిశ్రా మరియు శ్రీ ఉన్నవ రాజగోపాల కృష్ణయ్య గార్లు చిత్తూరులో నన్ను కలిశారు. నేను సభ యొక్క హిందీ రాష్ట్ర భాషా విశారద పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకు హిందీ నేర్పే హిందీ మహావిద్యాలయాన్ని ప్రారంభించాలని వారి కోరిక. ఈ విధంగా చిత్తూరులో గ్రీమ్స్ స్పేట్ లో హిందీ మహావిద్యాలయాన్ని ప్రారంభించాము. దానికి మొట్టమొదటి ప్రధానాచార్యులు శ్రీ చిత్తూరు లక్ష్మీనారాయణ శర్మ. కొన్ని సంవత్సరముల తర్వాత అదే స్థానంలో హిందీ ప్రచారక్ విద్యాలయాన్ని ప్రారంభించటం జరిగింది. అది ఏడు సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా నడిచింది. ప్రచారక్ విద్యాలయంలో అధ్యాపకులుగా డా॥ తేజ్ నారాయణ్, శ్రీ బాలశౌరిరెడ్డి, శ్రీ నీలకంఠమూర్తి, శ్రీ ధర్మరాజన్ మరియు అనేక సమర్థ వంతమైన హిందీ విద్వాంసులు పనిచేశారు. ఆ రోజుల్లో అనేకమంది ఉత్తర భారతేదేశానికి చెందిన హిందీ విద్వాంసులు చిత్తూరు వచ్చారు. వారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మరియు హిందీ బోధనా పద్ధతులు యొక్క స్థితి మరియు బోధనా పద్ధతులు చూసి ఎంతో ప్రభావితులయినారు. అప్పటి జిల్లా సెషన్స్ జడ్జ్, అజీమ్ గారు ఉత్తర భారతేదేశం నుండి వచ్చిన విద్వాంసుల గౌరవార్థం టీ పార్టీ యిచ్చారు. అజీమ్ సాహబ్ గారు ముస్లిం అయినప్పటికీ హిందువుల ఆచార వ్యవహారాలను గౌరవించేవారు. శ్రీ ముంగర శంకర రాజుగారు హిందీ మరియు తెలుగు భాషలలో నిష్ణాతులయిన విద్వాంసులలో ఒకరు. ఆయన 'రామ చరితమానస్'ను హిందీ నుండి తెలుగులోనికి అనువదించారు. దానిని చిత్తూరులోని రామవిలాస సభ యొక్క విశేష కార్యక్రమంలో ఆవిష్కరించటం జరిగింది. ఈ విధంగా హిందీ అధ్యయనం మరియు ప్రచారం చిత్తూరు జిల్లాలో బలంగా వేళ్ళూనుకుంది.

1948లో నేను దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాస్ యొక్క శాసీ పరిషత్ సభ్యునిగా ఎన్నికయ్యాను. 1950లో భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చింది.. రాజ్యాంగం ద్వారా స్వీకరించిన భాషలపట్టికలో 'హిందుస్తానీ' కి బదులుగా 'హిందీ' శబ్దాన్ని ప్రయోగించటం జరిగింది. అందువలన నా సలహాప్రకారం 'సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కొరకు దక్షిణ భారత్ హిందుస్తానీ ప్రచార సభ'గా పెట్టడం జరిగింది. ఔను, ఇప్పటికీ సభ యొక్క ముఖ్యభవనానికి ఎదురుగా ఉన్న గోడ పై ఉన్నటువంటి శిలాఫలకంపై 'హిందుస్తానీ ప్రచారసభ' అని వ్రాసి ఉంది. దానికి అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభోత్సవం చేశారు.

శాసీ పరిషత్ మీటింగుల్లో సభ యొక్క అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు గైర్హాజరు అయినచో అటువంటి సందర్భంలో అధ్యక్షత వహించటానికి సమితిలోని ఏదో ఒక సభ్యుడిని నియమించే సాంప్రదాయం ఉంది. రెండవ మీటింగులో యింకొకరు అధ్యక్షులు అవవచ్చు. సభ యొక్క కార్యక్రమాలను నిరంతరం నిర్విఘ్నంగా జరిపించాలనే ఉద్దేశ్యంతో నాసలహా ప్రకారం శాసీ పరిషత్ యొక్క అధ్యక్షులు అనే కొత్తపదవిని సృష్టించటం జరిగింది.

దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే అధ్యక్షులకు వెనుకటి మీటింగులలో జరిగిన కార్యకలాపాలు గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కనుక వాటిని ఆమోదించటం సులభమవుతుంది. అంతేకాకుండా జరుగబోయే మీటింగులను వెనుకటి అనుభవంతో క్రమపద్ధతిలో నిర్వహించటానికి వీలవుతుంది. ఈ విధంగా ఎన్నికయినటువంటి మొట్టమొదటి అధ్యక్షులు శ్రీ కె. బాలసుబ్రహ్మణ్యం అయ్యర్. వారు హిందీ ప్రచారంలో ఎంతో మక్కువ చూపేవారు. 1956లో నేను శాసీ పరిషత్ అధ్యక్షుడనయ్యాను. తరువాత శాసీ పరిషత్ యొక్క అనేక మీటింగులలో ఏమనిపించిందంటే భారత ప్రభుత్వంతో సభ రాజ్యాంగం ప్రకారం డిగ్రీ మరియు డిప్లొమాలను ప్రదానం చేసే అధికారాన్ని ఇమ్మని కోరాలని, అవి భారత ప్రభుత్వం ద్వారా ఇచ్చే డిగ్రీ మరియు డిప్లొమాలతో సమాన స్థాయిలో ఉండేటట్లుగా మరియు హిందీ శిక్షణ మరియు అధ్యయనానికి అనుకూలంగా ఉండేవిధంగా దీని గురించి గౌరవనీయులైన రాష్ట్రపతిగారికి వినతి పత్రం పంపించటం జరిగింది. రాష్ట్రపతి దీనిని పరిశీలించి యిది సరియైనదేనని భావించారు. సభ యొక్క 'దీక్షాంత్ సమారోహ్'లో భారత ప్రభుత్వపు అప్పటి విద్యాశాఖామంత్రి గారు దక్షిణ భారత హిందీ ప్రచార సభను హిందీ సాహిత్య సమ్మేళన్, ప్రయాగతో సమానంగా గుర్తించినట్లుగా ప్రకటించారు. తరువాత సుదీర్ఘ కాలంపాటు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా నేను ప్రతిపాదించినటువంటి డ్రాఫ్ట్ ను స్వీకరిస్తామని హామీ యివ్వడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ ప్రకారం సభ తన రాజ్యాంగము, సభ్యత్వము, ఎన్నికల ద్వారా పని చేస్తుంది. పార్లమెంట్ ద్వారా స్వీకరించిన దక్షిణ భారత హిందీ ప్రచార సభ యొక్క అధినియమంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభను 'రాష్ట్రీయ మహత్వకీ సంస్థాన్' గా గుర్తించటం జరుగుతుంది. ప్రస్తావించిన అధినియమం ప్రకారం విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమీషన్, అధినియమానికి అనుకూలంగా సభ హిందీ ప్రచారము మరియు అధ్యయనం కొరకు డిగ్రీ, డిప్లొమాల యొక్క ప్రమాణ పత్రాలను ప్రధానం చేయగల్గుతుంది. భారత ప్రభుత్వము నేను సమర్పించిన డ్రాఫ్ట్ ను చిన్న చిన్న మార్పులతో స్వీకరించటం జరిగింది. ఈ విధంగా 1964 మే నెలలో ఈ అధినియమం లోక్ సభ మరియు రాజ్యసభలలో ఆమోదం పొందింది. ఈ అధినియమం 1 జూన్, 1964 నుండి అమలులోనికి వచ్చింది. అప్పుడు శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారు సభాధ్యక్షులు, నేను శాసీ పరిషత్ యొక్క అధ్యక్షుడిని. అధినియమం అమలులోనికి వచ్చిన తరువాత వ్యవస్థాపక సమితిలో 'ఉచ్చ శిక్షా ఔర్ శోధ్ సంస్థాన్'ను స్థాపించటానికి సంబంధించిన బిల్లును ఆమోదించటం జరిగింది. దీని ద్వారా విద్యార్థులకు ఎం.ఎ., పి.హెచ్.డి మొదలైనటువంటి డిగ్రీలను ప్రధానం చేయుట కొరకు మరియు అధ్యయనానికి అవసరమయినటువంటి ఏర్పాట్లను చేయాలి. వ్యవస్థాపక సమితి దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసే అధికారం నాకు యిచ్చింది.

డా॥ అంబాప్రసాద్ సుమన్ యొక్క సహాయము మరియు సలహాలతో సిండికేట్ మరియు విద్యాపరిషత్ ను ప్రారంభించటం జరిగినది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకకు చెందిన నాలుగు భాషల యొక్క ప్రతినిధులను ఇందులో సభ్యులుగా నియమించటం జరిగింది. ఈ విధంగా ఉచ్చ శిక్షా విభాగం కార్యకలాపాలు 2 అక్టోబర్, 1964లో ప్రారంభమయినవి. కాని దీని యొక్క ప్రారంభోత్సవము 6 నవంబర్ 1964లో అప్పటి భారత ప్రధాని మరియు సభ యొక్క అధ్యక్షులయి నటువంటి శ్రీలాల్ బహుదూర్ శాస్త్రి గారి కరకమలాల ద్వారా జరిగింది. శ్రీ లాల్ బహుదూర్ శాస్త్రి గారిని పి.జి విభాగానికి ఛాన్సలర్ గాను, నన్ను వైస్ ఛాన్సలర్ గాను నియమించటం జరిగినది. ఎం.ఎ., మొదటి బ్యాచ్లో 20 మంది విద్యార్థులు చేరారు. పి.జి. విభాగపు ప్రారంభోత్సవ సందర్భంగా 70 మంది వైస్ ఛాన్సలర్లు మరియు హిందీ విభాగాధ్యక్షులు యొక్క శుభాకాంక్షలు మరియు సందేశాలు నాకు అందాయి. 1964లో దక్షిణ భారతదేశంలో జన్మించిన శిశువు యొక్క కథ యిది. నేను ఈ విభాగాన్ని చక్కగా నడిపేందుకు అవసరమైనటువంటి గ్రాంటును భారతప్రభుత్వం నుంచి పొందటంలో సఫలీకృతమయినాను. నియామకాల యొక్క అధికారం పూర్తిగా నా చేతిలో ఉండేది. 1965 సంవత్సరం చివరిరోజులలో అనేకమంది శాసీపరిషత్ కు ఎన్నికయి వచ్చి నటువంటి సభ్యుల మనస్సులో అధికారం పొందాలనే తపన ప్రారంభమయింది. నేను సభను 'రాష్ట్రీయ మహత్వ సంస్థాన్' గా రూపొందించటానికి పదహారు సంవత్సరాలపాటు నిరంతరకృషి చేశాను మరియు పి.జి. విభాగాన్ని స్థాపించటం లో విజయాన్ని పొందాను. కాని ఎన్నికల గోదాలో దూకటానికి నా మనస్సు అంగీకరించలేదు. తరువాత నేను శాసీ పరిషత్ సభ్యుడిని కూడా కాలేదు. ఇప్పుడు నేను సభ యొక్క అధ్యక్షుడిని గాను. ఉపాధ్యక్షుడిని అంతకన్నా గాను..

కొత్తగా స్థాపించిన సంస్థ ఒక సంవత్సరము వయస్సు ఉన్న శిశువు. నేను ఎంతో ప్రేమతో పెంచిన ఈ శిశువును యింకొకరి చేతులలో పెట్టేటప్పుడు నాకు తీరని ఆవేదన కలిగింది. కాని నేను ఏమి ఆలోచించానంటే అనేకమంది అనాథ పిల్లలు ఇతర తల్లితండ్రుల పెంపకంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటారు. అదే విధంగా వేలమంది హిందీ ప్రేమికుల ద్వారా ఎన్నికయినటువంటి విభిన్న పరిషత్ లు మరియు అనేక వందల మంది కార్యకర్తలు కలిగిన సభ ఈ శిశువును నిర్లక్ష్యంచేయదని భావించాను. వారందరూ కలసి మరింత సమృద్ధిగా తయారు చేసి దేశానికి మహత్వపూర్ణమయిన సేవలను అందించే సంస్థగా రూపొందిస్తారని భావించాను. సభ యొక్క ఈ స్థితిలో ఉజ్వల భవిష్యత్ ను ఆకాంక్షిస్తూ 'ఉచ్ఛశిక్షా ఔర్ శోధ్ సంస్థాన్' నుంచి సెలవు తీసుకున్నాను. తరువాత సభ నన్ను ఎన్నడూ పిలువలేదు. స్వర్ణజయంతి, వజోత్సవం, మరియు అమృతోత్సవం సందర్భంగా నానుంచి అనేక సలహాలను స్వీకరించారు మరియు నన్ను సన్మానించారు. 55 సంవత్సరాల వరకు హిందీ సభ యొక్క ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటూ 7-9-2001 నాటికి నా జీవితంలో 97వ సంవత్సరంలోనికి ప్రవేశించాను. ఇప్పుడు నాకు నిజంగా ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే నాకు ఏమనిపిస్తుందంటే హిందీ మరియు దేశ సేవలో నా జీవితం నిజంగా సార్థకమయినది.

Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी