సుశీల సౌభాగ్యం




సుశీల సౌభాగ్యం

మణిపురి మూలం : డా. చోం. యామినిదేవి   
मणिपूरि मूल : डॉ. चों. यामिनि देवी
            
  హిందీ అనువాదం : డా. ఇ.విజయలక్ష్మీ
हिंदी अनुवाद : डॉ. इ. विजयलक्ष्मी  
                       
తెలుగు అనువాదం : డా. ఎస్.వి.ఎస్.ఎస్. నారాయణ రాజు
             तेलुगु अनुवाद : डॉ. एस.वी.एस.एस. नारायण राजू 
   
స్రవంతి. ద్విభాషా మాస పత్రిక,
ఆగస్టు, 2006                                                            

       మాపామ్ చకౌబా (వివాహం జరిగిన ఐదవరోజున ఇచ్చే విందు భోజనం) కి మతౌలైబీ స్నేహితురాళ్ళు అందరూ చక్కగా ముస్తాబై విందుకి వచ్చారు. వారిలో వారు అనేక విషయాలపై మాట్లాడుకుంటున్నారు. కొందరు వస్తువులు కొనుక్కునే మరుప్ (సహాకార సంస్థ) లో సభ్యులను చేర్చుకోవడానికి, బ్యూటీ కాంటెస్ట్ ల గురించి రకరకాల విషయాలపై జోరుగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

   మహిళాభ్యుదయం కోసం నిరంతరం పాటు పడుతున్న తంఫైబెమ్మ ఈ రోజున మణిపూరి స్త్రీలలో పెరుగుతున్న ఎయిడ్స్ వ్యాధిని ఎలా అరికట్టాలి అన్నదానిపై చర్చ జరపాలి అన్నది. తంఫైబెమ్మ మాటకు మద్దతు ఇస్తూ రమోనీ ఇలా అన్నది -  మీరు చెప్పింది నిజం. ఎయిడ్స్ చాలా భయంకరమైనది నిన్ననే నేను పేపరులో చదివాను. 30 సంవత్సరముల యువతి, తనకి ఎయిడ్స్ సోకింది అనే విషయం తెలుసుకుని విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది.

  మధ్యవయస్కురాలైన ఒక స్త్రీ కలుగుజేసుకుని అవును, అవును, సుశీల మా వీధిలోనే ఉండేది. చాలా దురదృష్టవంతురాలు. చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకుంది. భర్త కూడా కొన్ని రోజుల క్రితం తుపాకిగుండు తగిలి మరణించాడు. చక్కటి నడవడిక కలిగి కష్టపడి పనిచేసే సుశీలకు ఎలా ఎయిడ్స్ వచ్చిందనేది తెలియలేదు, అత్తమామలకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అప్పటినుంచి ఆమెతో సరిగ్గా వ్యహరించలేదు. దాంతో కృంగిపోయి ఆత్మహత్య చేసుకుంది”, ఇంతలోనే భోజనాలు సిద్ధం అంటూ పిలవడంతో ఒక్కొక్కరే లేచి భోజనాలు వైపు వెళ్ళిపోయారు, అందరూ భోజనాలలో నిమగ్నమై పోయినారు.

  ఎయిడ్స్ కంట్రోల్ అండ్ రిహెబిలిటేషన్ కేంద్రంలో సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న వినోదిని మాత్రం, సుశీలకి ఎయిడ్స్ ఎలా వచ్చింది అని తెలుసుకోవాలనే దృఢ నిశ్చయంతో ఇంటికి చేరింది. వినోదిని భర్త డా. సుకుమార్ కూడా ఎయిడ్స్ నియంత్రణ కేంద్రంలో డాక్టర్ గా పనిచేస్తున్నాడు.
  భర్త క్లినిక్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత, అతని కొరకు టీ తయారు చేస్తూ వినోదిని ఈ రోజు ఎటువంటి కేసులు వచ్చాయి అని అడిగింది.

రోజులాగానే, డ్రగ్స్ కి అలవాటు పడిన ఒక యువకుని రక్తపరీక్ష చేశాను అని సుకుమార్ జవాబిచ్చాడు.

  మణిపుర్ లో విస్తరిస్తున్న ఎయిడ్స్ కి కేవలం డ్రగ్స్  మాత్రమే కారణం అని అనడం ఎంతవరకు సబబు అని వినోదిని అడిగింది.

టీ త్రాగుతూ డా. సుకుమార్ ఇలా అన్నాడు – అలాగ చెప్పలేము డ్రగ్స్ వలన ఈ వ్యాధిబారిన పడే యువకుల తిరుగుళ్ళను తగ్గించాలి అనే ఉద్ధేశ్యంతో వీరికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఎంతోమంది అమాయక యువతులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు కావడానకి ఇదొక ముఖ్యకారణం అని చెప్పవచ్చును.

 స్వయంగా డ్రగ్స్ తీసుకోనప్పటికి, ఎంతోమంచి నడవడిక కలిగిన అమ్మాయిలు తమ ఇంటిలోనే కాక, చుట్టుప్రక్కల సమాజం నుండి కూడా తిరస్కార భావానికి గురి అయి, సిగ్గుతో ఆత్యహత్యలు చేసుకుంటున్నారు. ఈ విషయం మీకు తెలుసా అని వినోదిని సుకుమార్ ని అడిగింది.

 ఆవ్యాధి అమ్మాయిలకి తమ భర్తల నుండే సంక్రమించి ఉండవచ్చు అని నెమ్మదిగా డాక్టర్ జవాబిచ్చాడు.

  ఆమె భర్తకి ఎయిడ్స్ వ్యాధి సోకిందా లేదా అని తెలుసుకోవచ్చును. కాని, అతను ఆమెకన్నా ముందే ఉగ్రవాదులకు మరియు సైనికులకు మధ్య జరిగిన పోరాటంలో వారి తుపాకి గుళ్ళకు బలి అయిపోయినాడు. అసలు తప్పెవరిదో తెలుసు కోకుండా అమ్మాయిని తప్పుపట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని నా అభిప్రాయం.

  ఎయిడ్స్ తో మరణించిన ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఎలా వచ్చింది అన్నది తెలుసుకోవాలని ఆ దంపతులిరువురు నిర్ణయించికున్నారు. మరుసటి రోజు సుశీల అత్తగారింటికి వెళ్ళి, ఆమె మరణానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించారు.

  ఆమె అత్తగారు వినోదిని వైపు దీనంగా చూస్తూ అమ్మా, నాకు చాలా బాధగా ఉందమ్మా! మా కోడలే పని చేసి సంపాదిస్తూ మా ముసలి దంపతులను ఎంతో చక్కగా చూసుకొనేదమ్మా.”

మరి అటువంటప్పుడు కోడలిపట్ల అంత కఠినంగా ఎలా వ్యవహరించారు, చివరికి ఆమె కన్న బిడ్డకి అన్నం తినిపించడానికి కూడా ఎందుకు అనుమతించలేదు, పిల్లవాడిని ఆమె దగ్గరకు వెళ్ళకుండా ఎందుకు అడ్డుకున్నారు? అలా ఎందుకు చేశారు?” అని వినోదిని అడిగింది.

  ఆమెకు వచ్చింది భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి. ఆ పేరు చెబితేనే అందరూ భయపడతారు. నా మనవడే నాకు సర్వస్వం. వాడి కోసమే నేను జీవిస్తున్నాను. నా మనవడికి కూడా వ్యాధి అంటుకుంటే ఎలా?” అని అన్నది.

 అమ్మా! ఈవ్యాధి రోగితో కలిసి ఉండటంవలన కాని, తినడం వలన గాని రాదు. మీ ఆలోచన తప్పు. అయినా ఆమెకు ఆవ్యాధి ఉంది అని మీకు ఎలా తెలిసింది?

 ఆమెకు తలనొప్పి, జ్వరం తరచూ వస్తూ ఉండేవి. రక్త పరీక్ష చేయిస్తే అమెకి వ్యాధి ఉందని తెలిసింది. ఈవ్యాధి సరియైన నడవడిక లేని వాళ్ళకి వస్తుంది అని చాలామంది చెప్పారు. సుశీల రాళ్ళు మొయ్యడానికి, కూలీ పనికి బయటికి వెళ్ళేది. ఎక్కడ ఏమి జరిగినది? మాకు ఎలాగా తెలుస్తుంది?” అని అన్నది.

 ఈకథంతా విన్న సుకుమార్ కి చాలా బాధ కల్గింది. అతను కోపాన్ని అణుచుకోలేక – ఒకవేళ ఆవ్యాధి ఆమెకు భర్తనుండే సంక్రమించి ఉండవచ్చు కదా!” అని అన్నాడు.

 ఇది విన్న ఆ ముసలమ్మ ఒక్కసారిగా మండిపడుతూ ఇలా అన్నది – ఏయ్? ఏమి మాట్లాడుతున్నారు బాబు? చనిపోయిన వాడిపైన నిందవేస్తారా? ఇది న్యాయమా? నా కొడుకు తోయిబాకి ఎటువంటి డ్రగ్స్ అలవాటు కూడా లేదు. ఆడవాళ్ళపై మోజుపడే గుణం లేదు. చాలా బుద్దిమంతుడు, ఆటలు ఆడటం అంటే ఎంతో ఇష్టం అని అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఒక ఫోటోని తీసుకునివచ్చి చూపిస్తూ, - చూడండి బాబు! మా అబ్బాయి ముఖం, ఎంత చక్కనిది. ఇటువంటి మంచి అబ్బాయి చెడ్డదారిలో వెళతాడంటే నమ్ముతారా?” అని అన్నది.

 ఫోటో చూస్తూనే డాక్టర్ సుకుమార్ కి గుర్తు వచ్చింది. ఒకరోజు తోయిబా రక్తపరీక్ష చేయించుకోవడానికి తన క్లినిక్ కి వచ్చాడు.

 ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్, వినోదినికి క్లినిక్ కి రక్తపరీక్షకి వచ్చినప్పుడు తోయిబా చెప్పిన విషయాలన్ని చెప్పాడు.

 తోయిబా – డాక్టర్ గారూ! నేను ఒక ఇంటర్వ్యూ కోసం గౌహతి వెళ్ళవలిసి వచ్చింది. అయితే ఆ రోజు నాకు టికెట్ దొరకలేదు. కడలా పార్క్ దగ్గర నిలిచి ఉన్న బస్సుల దగ్గర నిరాశగా నిల్చుని ఉన్నాను. ఇంతలో ఒక అందమైన, యువతి వచ్చింది. ఆమె హైహిల్స్ చెప్పులు వేసుకొని, ఎర్రటి లిప్ స్టిక్ పెదాలతో, గ్లాగుల్స్ వేసుకొని చీరకట్టుతో ఎంతా అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి, మీరు గౌహతి వెళుతున్నారా?” అని అడిగింది.

అవును నేను వెళ్ళాలి, కాని టికెట్ లేదు అని నేను జవాబిచ్చాను.

 నాదగ్గర ఒక ఎక్సట్రా టికెట్ ఉంది. మీరు దీనిని తీసుకోవచ్చును. మీ తోడుంటే నాకు కూడా చాలా మంచిది నేను కాదనలేకపోయాను. ఇది దేవుని కృప అనుకుని బస్సు ఎక్కాను. ఆ స్త్రీ నా ప్రక్క సీట్లోనే కూర్చుంది. ఆమె ఎక్కడికి వెళుతుంది ఎందుకు వెళుతుంది? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం నేను చెయ్యలేదు.

 ఉదయం నుండి బస్సులోనే కూర్చున్నాం. కొంచెం కొంచెం దూరంలోనే తనిఖీ పేరుతో బస్సులో నుండి క్రిందకి దించుతున్నారు. పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. మరలా కొంచెం ముందుకు వెళ్ళగానే బస్సు మరలా ఆగింది. సాయంత్రం అవుతున్నది. సూర్యాస్తమయం అవుతున్నది. సూర్యుని ఎర్రటి కిరణాలు బస్సుపైన పడుతున్నాయి. ఒకపైపు కొండ, ఇంకొకవైపు లోయ, డీమాపుర్ ఘాట్ రోడ్ మలుపులలో అక్కడక్కడ వెళుతున్న బస్సులు కన్పిస్తున్నాయి. చెట్లు వంగుతూ సూర్యునికి వీడ్కోలు చెబుతున్నాయా అన్నట్లుగా కన్పిస్తున్నాయి.

 అంత అద్భుతమైన ప్రకృతి సౌందర్యం నా మనస్సును అంతగా ఆకర్షించటం లేదు. నేను ఇంటర్వ్యూలో విజయం పొందితే ఉద్యోగం వస్తుంది అనే విషయం మాత్రమే నా మనుస్సులో పదే పదే మెదుల్తున్నది. ఈసారి నా బి.ఏ. సర్టిఫికెట్లు మరియు ఆటల పోటీల సర్టిఫికెట్లు నాకు బాగా ఉపయెగపడతాయి. అమ్మ, నాన్నలు కూడా ముసలి వాళ్ళు అయిపోతున్నారు. భార్య వచ్చింది. త్వరలోనే తండ్రిని కూడా కాబోతున్నాను. అందువలన ఇప్పుడు ఎక్కువ సంపాదించవలిసిన అవసరం ఎంతైనా ఉంది.

 ఈ విధంగా నేను పరిపరివిధములైన ఆలోచనలలో నిమగ్నం అయి ఉండగా బస్సు మరలా ఆగిపోయింది. ఇంక ముందుకు వెళ్ళదని ఎవరో చెప్పారు. అందరూ బస్సునుండి క్రిందకి దిగుతూ ఒకరినొకరు ఏమైంది? ఏమైంది? అని ప్రశ్నించుకోసాగారు.

 ఒక వ్యక్తి వచ్చి – డీమాపుర్ లో ప్రభుత్వంలోని పెద్ద పదవిలో ఉన్న ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారంట. అక్కడ కర్ఫ్యూ విధించారని తెలిసింది అని చెప్పాడు. ఇప్పుడు ఇంఫాల్ వెళ్ళడం కష్టం, డీమాపుర్ చేరడం అంతకన్నా కష్టం. ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటూ అందరూ గాబరా పడసాగారు.

 అందరూ ఎవరికి వారు కావలిసిన ఏర్పాట్లు చేసుకోండి, బండిలో ఎవరూ ఉండటానికి వీలులేదు అని బస్సు యజమాని చెప్పాడు.

 అటువంటి పరిస్థితిలో ఊరు పేరు ఏమి తెలియని స్త్రీ యొక్క బాద్యత తీసుకోవలసి వచ్చింది. ఆమె వలననే నాకు టికెట్ లభించింది. ఆ కృతజ్ఞతా భావం నన్ను కట్టి పడేసింది.

 నాగాలాండ్ లోని సాత్ మైల్ అనే ప్రదేశానికి నడిచి చేరుకున్నాం. అక్కడ ఒక హోటల్ లో ఒకే గదిలో ఆస్త్రీతో కలిసి మూడు రాత్రుళ్ళు గడిపాను. గదిలో ఆ స్త్రీ స్వర్గంలోని అప్సరసలాగా కనిపించింది.

 చూసిచూడనట్లుగా, కావలసినప్పటికి అక్కరలేనట్లుగా నాటకం ఆడాను. ఆమె బాత్ రూమ్ లో నుండి వచ్చి తడిసిన శరీరాన్ని తుడుచుకుంది. తన వస్త్రాలను వదులు చేసి తన శరీరాంగాలును చూపించడం ప్రారంభించింది. అద్దం దగ్గరికి వెళ్ళి ముస్తాబు అయ్యింది. నా మంచం మీద పడుకొని తన మాటల చాతుర్యంతో నన్ను ఆకర్షింప చేయడం ప్రారంభించింది. నేను తన ఆకర్షణ అనే సాలె గూడులో చిక్కుకోవడం ప్రారంభించాను. నేను నియంత్రణను కోల్పోయాను. తన మెహపు చూపుల గాలంలో ఎంతో మందిని పట్టిన ఆ వన్నెలాడి అసలు చరిత్ర తర్వాత అర్థం అయింది.

 నా దగ్గర ఉన్న డబ్బులు అన్ని ఖర్చు అయిపోయాయి. ఇంటర్వ్యూకి కూడా వెళ్ళలేకపోయాను. నా దాంపత్య జీవితపుసీమను  ఉల్లఘించాను ఆ తర్వాత ఆ స్త్రీని వదిలి అక్కడి నుండి పారిపోయి వచ్చాను.

 అతడు ఆవిధంగా తన పూర్తికథను చెప్పిన తర్వాత రక్తపరీక్ష చెయ్యమని నన్ను అడిగాడు అని సుకుమార్ వినోదిని వైపు చుస్తూ చెప్పాడు.

  ఆ తర్వాత ఏమి అయింది?” అని వినోదిని ఎంతో ఆత్రుతగా భర్తను అడిగింది.

 జరగడానికి ఇంకేం ఉంది? అతని రక్తాన్ని పరీక్షించాను సుశీల దురదృష్టం, ఆమె భర్త తోయిబా రక్తంలో హెచ్.ఐ.వి. పాజిటివ్ వచ్చింది.                

Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

लहरों के राजहंस और सुंदरी

“कबीर के दृष्टिकोण में गुरु”