శ్రీ కాజ వేంకటేశ్వరరావు గారి గురించి నేను విన్నంత ... కన్నంత ...






శ్రీ కాజ వేంకటేశ్వరరావు గారి గురించి నేను విన్నంత ... కన్నంత ...

ఆచార్య. ఎస్.వి.ఎస్.ఎస్. నారాయణ రాజు

हिंदी कृषक
बाबू गंगाशरण सिंह पुरस्कार विजेता
श्री काज वेंकटेश्वर राव जी का अभिनंदन ग्रंथ, 2005 
                                    

 
 నేను ఎమ్.ఏ హిందీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు మిత్రులతో ఎమ్.ఏ పూర్తి అవగానే ఉద్యోగం రావలంటే ఏమి చేయాలి అని చర్చించేవాడిని. చాలా మంది మిత్రులు బి.యిడి. చేస్తే మంచిది అని సలహా ఇచ్చారు. బి.కామ్  వాళ్ళకి జనరల్ బి.యిడి. లో సీటు రావటం కష్టం అందువలన మనకి హిందీ బి.యిడి.  మంచిది అని చెప్పారు. అప్పుడు హిందీ బి.యిడి. ఎక్కడ చేయాలి అని ఆరా తీయగా విజయవాడ లో బి.యిడి. ఉంది అని తెలిసింది. అక్కడ శ్రీ కాజ వేంకటేశ్వరరావు గారి హిందీ కాలేజి ఉంది అని తెలిసింది. ఆ విధముగా నేను మెదటిసారిగా కాజ వేంకటేశ్వరరావు గారి పేరు వినడం జరిగింది. కొన్ని కారణాల వలన నేను హిందీ బి.యిడి.కాకుండా జనరల్ బి.యిడి, చేశాను. వెంటనే పిహెచ్.డి జాయిన్ అయ్యాను. పిహెచ్.డి అవగానే విశాఖపట్నంలో బి.యిడి. కాలేజిలో లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. అప్పుడు బి.యిడి. కాలేజిలో లెక్చరర్ గా పర్మినెంట్ అవ్వాలి అంటే యం.యిడి. అవసరం అని తెలిసింది. మరల యం.యిడి. గురించి ఆరా తీయగా ఈ సంవత్సరం విజయవాడ లో యం.యిడి ప్రారంభిస్తున్నారని విన్నాను.   అప్పుడు మరల కాజ వేంకటేశ్వరరావుగారి గురించి రెండవసారి విన్నాను.అయితే కారణాంతరాల వలన యం.యిడి ప్రారంభం కాలేదు. ఈలోపుగా నేను పి.జి విభాగంలో లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. అప్పుడు మెదటిసారిగా నేను దక్షిణ భారత హిందీ ప్రచార సభ హైదరాబాద్ కేంద్రంలో వారిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది.

 2003 జనవరి లో విజయవాడలో ఎం.ఏ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాంటాక్టు క్లాసులు చెప్పడానికి మెదటిసారగా నేను వెళ్ళాను. అప్పుడు కాజా వారితో ప్రత్యక్షంగా మాట్లాడటం జరిగింది. అయితే మెదటి రోజునే వారు చూపిన ఆదరణ, స్నేహం నేను ఎన్నటికి మరవలేనిది. వారు అధ్యాపకులందరికి ముందు సన్మానం చేసి గౌరవించిన తర్వాతనే మేము క్లాసులకి వెళ్ళడం జరిగింది. ఇది ఆయనకు అధ్యాపకుల పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. తర్వాత స్రవంతి సంపాదకులుగా వారు రావటం జరిగింది. అక్కడి నుండి వారితో పరిచయం నాకు బాగా పెరిగింది.

 శ్రీ కాజ వేంకటేశ్వరరావు గారికి బాబు గంగాశరణ్ సింహ్ అవార్డును ప్రకటించిన తర్వాత, వారికి ఒక అభినందన గ్రంథం వేస్తున్నామని చెప్పడమే కాక, దాని సంపాదకత్వ బాధ్యతను నామీద పెట్టారు. మెదటి ఇంత పెద్ద బాధ్యతను నిర్వహించగలనా అన్న సందేహం కలిగింది. అయితే తర్వాత కాజా గారు ఇచ్చిన ప్రేరణతో దీనిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది.
శ్రీ కాజ వేంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడగానే ఆయన చేసిన హిందీ ప్రచార కార్యక్రమాలు మాత్రమే ముందుగా గుర్తుకు వస్తాయి. కవి, విమర్శకుడు, నవలా మరియు కధా రచయిత, వ్యాసకర్త అని చాలా మందికి తెలియదు. దానికి కారణం ఆయన తన రచనలను అభిలాషి అనే కలం పేరుతో చేయడమే. ఆయన హిందీ, తెలుగు రెండు భాషలలో సమాన దక్షతతో రచనలు చేసి తాను సవ్యసాచిని అని నిరూపించుకోవడం జరిగింది.

 ఖరము పాలు కడివిడైననేమి, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అన్నట్లుగా వారు వ్రాసినవి తక్కువే అయిన, వాటిలో అవి అత్యుత్తమమైనవి. వారు హిందీలో అంతస్థల్ పేరుతో ఒక కవితా సంకలనం ప్రచురించడం జరిగింది. ఇది పునఃముద్రణ కూడా జరగడం దీని విశిష్టతను చెప్పకనే చెబుతుంది.
  ఆయన కవితలు ఏవీ కవిత్వం వ్రాసి అచ్చు వేయడానికో లేక కవిగా ముద్ర వేయించుకోవడానికో కాక, అనేక సంఘటనలకు ప్రతి క్రియగా మాత్రమే వ్రాయడం జరిగింది. నెహ్రూ, ఇందిరాగాంధి, రాజీవ్ గాంధీ, హరిహరశర్మ, రామస్వామి, రామనందతీర్థగారి హిందీలకు సంబంధించిన కవితలే కాకుండా అనేక వ్యంగ్య గర్భితమైన కవితలను కూడా వ్రాయడం జరిగింది. ఈ విషయం ఈ దిగువ ఉదాహరణతో మనకు తెలియజేస్తుంది

  पुलिस की बीबी

 लोगों को कंट्रोल में चलानेवाला मैं

सत्ताधारी का बड़ा सेवक हूँ मैं।

टोपी मेरी क्या देखते लोग हैं,

चुप से इधर-उधर सरक जाते हैं।

तुम कौन होती हो बक बक करने।

कहता जो हूँ सो करो चुप चाप।

बोली बीबी मिया अरे, जरा ठहरो न?

बोली अपनी जरा संभल के आने दो न?

जानते नहीं? अब मैं सीखती हिंदी हूँ।

हिंदी में तुम और तुम्हारी सरकार

बेचारे दोनों बने स्त्रीलिंग””

                  (श्री काज वेंकटेश्वरराव)

    పోలీస్ భార్య

  ప్రజలను క్రమంలో పెడతాను నేను

సర్కారుకు నమ్మిన బంటును నేను

నా టోపీని చూసిన ప్రజలు

పిల్లిలాగా ప్రక్కకి తప్పుకుంటారు

నువ్వేమిటి కేకలేస్తున్నావు.

మారు మాట్లాడకుండనే చెప్పింది చెయ్యి.

  భార్య జవాబిస్తూ – కొంచెం ఆగు,

నేను సర్దుకుని వచ్చి జవాబిస్తా,

నీకు తెలుసా? నేను

హిందీ నేర్చుకుంటున్నాను,

హిందీలో నువ్వు, నీ ప్రభుత్వం

ఏమిటో తెలుసా.

పాపం ఇద్దరూ స్త్రీ  లింగాలే

    (స్వేచ్చానువాదం :  డా. నారాయణ రాజు) 

   ఈ విధంగా ఆయన కవిత్వంలో హాస్యంతో కూడిన వ్యంగ్యం పుష్కలంగా కనిపిస్తుంది.
  ఈయన మన రధసారధులు పేరుతో మనదేశంలో ముఖ్యమైన నాయకులు మరియు సంఘ సంస్కర్తల గురంచి విస్తృత పరిచయం ఒకే పుస్తకంలో తెచ్చి అందరికి అందించి, అందరిలోనూ దేశభక్తిని పెంపొందించాలనే తలంపుతో చేయి తిరిగిన రచయితల కలం నుండి జాలు వారిని నాయకుల మరియు సంఘ సంస్కర్తల జీవితాలు అనే ముత్యాల లేఖల మాలికను హారంగా చేసి, సమాజానికి అందించారు. ఇందులోని ఈ క్రింది వారి గురించిన వ్యాసాలు ఉన్నాయి అవి ....
శ్రీ పొట్టి శ్రీరాములు గారు, శ్రీ బూర్గుల రామకృష్ణారావు, గాంధీ టోపి గవర్నర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు గారు, శ్రీ కోపల్లె హనుమంతురావు, శ్రీ గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు, శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు, శ్రీ రాజేన్ బాబు దినచర్య, శ్రీ మోటూరి సత్యనారాయణ గారు, శ్రీ కొడాలి వెంకట సుబ్బారావు గారు, కార్యవాది శ్రీ కలపాల, శ్రీమతి రాజ్యం సిన్హా గారు, డా పట్టాభి, సరిహద్దు గాంధీ గఫర్ ఖాన్, శ్రీ బులాభాయి దేశాయిగారు, శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులుగారు, శ్రీ రవీంధ్రనాథ్ ఠాగుర్ గారు, శ్రీ సి.కె. నాయిడుగారు.

  కాజా వారు రాతి గుండెలు, ప్రమీలా, డా. పాషాణం మొదలైన నవలలో సమాజంలోని పరిస్థితులు మరియు విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను చక్కగా చిత్రీకరించారు. వారి నవలలోని పాత్రలు అన్ని సజీవపాత్రలే. నవలను చదువుతున్న ఏ పాత్రను గురించి చదువుతున్న అటువంటి పోలికలతోనే ఉన్నటువంటి వారు మనకు రోజూ అనేకమంది తారసపడటం జరుగుతుంది. ఇవి చదువుతుంటే వారిలోని ఒక సమాజసేవకుడుని మన కళ్ళముందుంచుతుంది.

   కదిలించిన కన్నీరు శ్రీర్షికతో కథాసంకలనం వచ్చింది. ఇందులోని కథలు కూడా చాలా వరకు నేటి సమాజంలో జరుగుతున్న ఘటనలను ఆధారంగా చేసుకుని వ్రాసినవే. ఈయన గధ్య రచనలలో సమాజంలోని ఆసమానతలను తొలిగించి, నైతిక విలువల పట్ల ప్రజలలో నిబద్ధతను పెంచాలి అన్న ఆవేదన సుస్పష్టంగా కన్పిస్తుంది.

 ఇందులోని కథలు ఈ విధముగా ఉన్నాయి.
(1)మరువమంటారం (2) వారిద్దరు (3) రెండురోజులు (4) మానవత్వం (5) నా నౌకరు కాదు (6) నిత్య నీరాజనము (7) కరగని శిలా (8) బంట్రోతు భుజంగరావు (9) అసలు రహస్యం (10) ఎందుకులే అత్తయ్యా (11) ఆదర్శ విద్యార్థి మొదలైనటువంటి కథల ద్వారా అప్పటి సామాజిక అసమానతలను విభిన్న వర్గాలలోని వ్యక్తుల మానసిక భావాలను కడు రమ్యంగా చిత్రీకరించడం జరిగినది. ఈ కథల సంపుటి ఒక్కటే చాలు ఆయన అగ్రశ్రేణి కధారచయిత అని చెప్పడానికి. కాజా గారి రచనలలో ఎక్కవగా పూజ్యబాపూజీ గారి ఆలోచనలు కన్పిస్తాయి. సమాజంలో ప్రత్యేకంగా మహిళల పట్ల గాంధీ గారి ఆలోచనా సరళిని రచయిత శ్రీ కాజా గారు ఎక్కువగా వ్యక్తపరచడం మనకు కనిపిస్తుంది. సమసమానత్వ సమస్య, వైధవ్యం, సమాజంలో వేళ్లూనుకు పోయిన అనేక మూఢ విశ్వాసాలను తొలిగించాడానికి తనవంతు ప్రయత్నంగా రచనల ద్వారా ప్రజలలో మార్పు తేవాలి అన్న సంకల్పం రచయితలో దృఢంగా కనిపిస్తుంది.

  రచయిత కేవలం జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ సమస్యలపైన కూడా అనేకసార్లు తన కవితల ద్వారా స్పందన వ్యక్త పరచడం జరిగింది. మాకొద్దీ పొత్తు గోర్బచేవ్ పైన వ్రాసిన కవితలు ఇందుకు ఉదాహరణ మాకొద్దీ పొత్తు లోని ఈ పంక్తులను పరికించినట్లైతే సమాజం పట్ల రచయితకు ఉన్న నిబద్ధత మనకు తెలుస్తుంది.

   సామ్రాజ్య కాంక్షయే

సమరంబు సల్పించు

సామ్రజ్య తృష్ణయే

మానవత్వంబు మరిపించు

బాబు మా కొద్దీ సామ్రజ్యవాదపొత్తు

బాబు మా కొద్దీ యుద్ధోన్మాద పొత్తు

ధన, మాన, ప్రాణముల్ హరించు,

జీవనమ్, బారమనిపించు

మహాకరువు పేరుతో

పొట్టలు గొట్టే, యీ యుద్ధం

మా మనములు, చూపులు, విన

రానీయం, కనరానీయం
            X   X    X
  శాంతిసాధన నవ ఆసియా ఆశయం

కార్మిక, కర్షక, సౌఖ్యజీవనమే మా లక్ష్యం

శాంతి సాధన కోసం, ప్రజారాజ్యం కోసం

యుద్ధానికి ఉద్వాసనం,

శాంతికి మా ఆహ్వానం.

  కాజ వేంకటేశ్వరరావు గారిలో ఒక నిబిడీకృతమైన ప్రకృతిని ఆరాధించే కవి ఉన్నాడనంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఎందుకంటే బహూశా చిన్నప్పటి నుండి పల్లె వాతావరణంలో పెరగడం వలన అయినా అయి ఉండ వచ్చును. రచయిత తన కథలలో చక్కటి సహజత్వం కోసం పాత్రలకు అనుగుణంగా సంభాషణలు వ్రాయడమే కాకుండా, పాత్రోచితంగా పదాలను కూడా వ్రాయడం జరిగింది ఎందుకులే అత్తయ్య అనే కథలో పశువుల కాపురులు ఇంటికి వస్తున్నప్పుడు పాడుకుంటూ వచ్చే లల్లాయి పాటలను రచయిత అద్భుతంగా వ్రాయడం జరిగింది. పశువుల కాపురులు ఈ విధంగా పాడుకుంటూ వస్తున్నారు.

  చూడు చెలిచెక్క చక్కని చేలు

పూసెను పచ్చ పచ్చని పూలు

పండునులే యిక పసిడి పంటలు

పోవునులే యిక మన కరువులు

 చెడడిచ్చట శ్రమ జీవి

చెడునిచ్చట సోమరి

కృషీవలుని కార్యరంగమిది

మానవుల మనుగడ కాదాంరభిది

మానవుని స్వేచ్చాయుత వృత్తి

మనదేశానికి అధికోత్పత్తి

మన దేశపు బృహత్ ప్రాజెక్టులు

మన కొసంగును బహూఫలితాలు

  పై పద్యాన్ని పరికించి చూచి నట్లైతే ఇందులో శ్రమైక సౌందర్యం, దేశభక్తి, ప్రకృతి ఆరాధన అన్ని కలగలపిరంగరించిన మధురమైన పాయసంవలె కనిపిస్తుంది.

 రచయితకు సమాజం పట్ల కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయిన నేనాశించిన రాజ్యంలో అనే పుస్తకంలో అందరూ ఎలా ఉండాలి అన్న దానిపై సంక్షిప్తంగా చక్కని తన అభిప్రాయాలను వ్యక్తపరచడం  జరిగింది. ఇవి ఈ నాటికి కూడా ఆచారణయేగ్యమే.  ఇవి వరుసగా రాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు, శాసన సభ్యులు, పరిషత్ ప్రెసిడెంట్, సమితి ప్రెసిడెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఆఫీసు ఉద్యోగులు, సరుకుల విక్రయం, శ్రామికులు, కోర్టులు ఈ పుస్తకం ద్వారా రచయితలోని అభ్యూదయవాది కనిపిస్తారు. రచయిత అనుకున్నట్లుగానే భారతదేశంలో అనేక కోట్లమంది దేశభక్తుల అభిప్రాయం కూడా ఇదే అనడం అతిశయోక్తి కానేకాదు. ఉదా – ముఖ్యమంత్రికి ఒక కారు, డ్రైవరు, జవాను, సెక్రటరీ ఉందురు. వీరే ఆయన రోజువారీ కార్యకలాపాలకు సహకారులు. శాసన సభ్యుల నిమిత్తం నిర్మించిన గృహములలో మొదటి నెంబరుగల ఇల్లు ముఖ్యమంత్రి నివాసముగా ఉండెను. అద్దె ఉండదు, నెలకు 900/-  రూపాయలు జీతముండును. ఇంతకు మించి ఏ విధమైన సిబ్బంది ముఖ్యమంత్రి కోసం ఉపయెగించబడదు.
 ఇది చదువుతున్నప్పుడు నిజంగానే ఇది సాకారమైతే ఎంత బాగుంటుందోనన్న ఊహ కూడా చాలా చక్కటి అనుభూతిని మిగులిస్తుంది. ఈ విధంగా రచయిత తన హిందీ తెలుగులలోని విభిన్న రచనా ప్రక్రియల ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నారు.

 కాజా వారి కార్యదక్షత గురించి నాకన్నా ఎక్కువగా తెలిసి వాళ్ళు అంతటా ఉన్నారు. ఆయనలో నేను చూసినది, నాకు నచ్చినది ఏమిటంటే సమయపాలన టైమ్ అంటే టైమ్ 7 గంటలు అంటే 10 నిమిషాల తక్కువ 7 గంటలకే తయారు ఉండటం ఆయన అలవాటు. ఇలాగే ఎన్నో విషయాలు ఆయననుండి నేర్చుకోవల్సిన అవసరం నేటి తరానికి ఎంతైనా ఉంది.

  ఆరోగ్యం బాగా లేకపోయినా హిందీ పట్ల వారికి ఉన్న ప్రేమ ఆయనను నడిపిస్తుంది అని  నా నమ్మకం. ఆయనతో నాకున్న కొద్దిపాటి పరిచయంతో నేను చూసింది, తెలుసుకున్నవి నాలుగు విషయాలు పాఠకులతో పంచుకోవాలన్న ఆలోచనకు రూపమే నా ఈ కాజ వేంకటేశ్వరరావు గారి గురించి నేను విన్నంత... కన్నంత ఈ సందర్భంగా వారికి ఆరోగ్యంతో కూడిన శతాయువుని ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी